గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనతో విభేదించి జగన్ కు మద్దతుగా నిలిచిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి అదే బాట పట్టారు. ఇప్పుడు మరోసారి ఏపీలో ముస్లింలకు ఆయన కీలక పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై కర్నూలులో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.
ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్ బిల్లు విషయంలో పార్లమెంట్ లో బీజేపీకి అండగా నిలిచి ముస్లింలను దగా చేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూల్లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, జనసేన తీరుపై మండిపడ్డారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చిన టీడీపీని ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఇంకా టీడీపీలోనే ఉన్న ముస్లింలను బయటికి రావాలని ఓవైసీ పిలుపునిచ్చారు.
వక్ఫ్ బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకించిన వైసీపీని ఓవైసీ అభినందించారు. భవిష్యత్తులో ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ, జనసేనలకు బుద్ధి చెప్పాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. వక్ఫ్ అమలు కోసం ముస్లింలు తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో ముస్లింలను బీజేపీ టార్గెట్ చేస్తోందని, ఉగ్రవాదుల పేరుతో సాధారణ ప్రజల్ని వేధిస్తోందని ఓవైసీ ఆరోపించారు. ఆరెస్సెస్ దేశంలో దర్గాలు, మసీదులను టార్గెట్ చేస్తోందన్నారు. పహల్గాం దాడికి కారణమైన వారిని ఇప్పటివరకూ ఎందుకు పట్టుకోలేదని ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi