ANDHRAPRADESH:కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం రైతుల నుంచి వందలాది ఎకరాల మేర భూమిని సేకరించాలనే ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు. అన్నం పెట్టే రైతుల నుంచి 1,777 ఎకరాల భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అందిపుచ్చుకుంటోంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం వద్దనుకున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పేస్ ఇండస్ట్రీని వద్దనుకోవడం వినడానికి చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం తన వద్ద ఓ బెటర్ ఐడియా ఉందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని అన్నారు. ఈ ఇండస్ట్రీ కోసం ఓ ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని తాము అమలు చేస్తోన్నామని వివరించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తోన్నామని చెప్పారు.
వినియోగించుకోవడానికి సిద్ధంగా 8,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి.. అదికూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందని, నారా లోకేష్ తెలిపారు. త్వరలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ అధినేతలను కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేయాలని ఆశించిన ప్రాంతంలో రైతుల నుండి భారీ నిరసనలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల దేవనహళ్లిలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు జారీ చేసిన తుది నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
రైతుల ఆందోళనలకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవనహళ్లి పరిధిలో భూసేకరణను పూర్తిగా విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రైతుల నిరసన 1,198వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విధాన సౌధలో రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన అనంతరం సిద్దరామయ్య ఈ ప్రకటన చేశారు. చెన్నరాయపట్టణ, దేవనహళ్లి తాలూకాలోని పరిసర గ్రామాలలో భూసేకరణను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కొందరు రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చారని, ప్రభుత్వం వారి నుండి మాత్రమే భూమిని సేకరిస్తుందని, వారికి అధిక నష్టపరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తామని సిద్దరామయ్య తెలిపారు