కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పదవికి ముప్పుగా భావించే నేతల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆధారాలు బయట పెడతానని చెప్పుకొచ్చారు.
అలానే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన విషయంపై కూడా రియాక్ట్ అయ్యారు. లోకేష్‌ను తాను కలవలేదని.. కలిసినా తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆయన తనకు మంచి మిత్రుడు అని.. అర్ధరాత్రి కలిసే అవసరం లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలు యువతను తప్పుదోవ పట్టించే లాగా ఉన్నాయని మండిపడ్డారు. అంతే కాకుండా బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఇక తనపై టన్నులకొద్దీ కేసులు పెట్టి ఒక్క ఆధారాన్ని కూడా చూపలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసారి డ్రగ్స్ అంటారు, మరోసారి కార్ రేసింగ్ అంటారు. అసలు విషయాలను దారిమళ్లించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఊడగొట్టారన్నారు. తులం బంగారం, వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు.
గత 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో 64 సీట్లు, 2018లో 88 సీట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారని.. కానీ ఇప్పుడు ప్రజలు చేసిన ఓటు తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను, మహిళలను, వృద్ధులను, బలహీన వర్గాలను మోసం చేసింది," అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా అని కేటీఆర్ విమర్శించారు. ఒక మంత్రి బాంబులు పేలుస్తానంటాడు, కానీ ఇప్పటికీ పేలలేదు. మరో మంత్రి ఎరువుల కోసం రైతులను వరుసలో నిలబెడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ అవకాశం ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి," అని కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
లోకేష్ ని నేను కలవలేదు.. ఒకవేళ కలిసిన తప్పేంటి..?#KTR #NaraLokesh #RevanthReddy #BRS #TDP #Congress #Telangana #AndhraPradesh #PoliticsToday #Oneindiatelugu pic.twitter.com/5p8MPnlOYE
— oneindiatelugu (@oneindiatelugu) July 18, 2025

Shakir Babji Shaik
Editor | Amaravathi