ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మాకు బాగా తెలుసు- కర్ణాటక నుంచి ఘాటు కౌంటర్


ANDHRAPRDESH:కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం రైతుల నుంచి వందలాది ఎకరాల మేర భూమిని సేకరించాలనే ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు. అన్నం పెట్టే రైతుల నుంచి 1,777 ఎకరాల భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అందిపుచ్చుకుంటోంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం వద్దనుకున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తోంది.

ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పేస్ ఇండస్ట్రీని వద్దనుకోవడం వినడానికి చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం తన వద్ద ఓ బెటర్ ఐడియా ఉందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని అన్నారు. ఈ ఇండస్ట్రీ కోసం ఓ ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని తాము అమలు చేస్తోన్నామని వివరించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తోన్నామని చెప్పారు.

వినియోగించుకోవడానికి సిద్ధంగా 8,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి.. అదికూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందని, నారా లోకేష్ తెలిపారు. త్వరలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ అధినేతలను కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.

కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేయాలని ఆశించిన ప్రాంతంలో రైతుల నుండి భారీ నిరసనలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల దేవనహళ్లిలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు జారీ చేసిన తుది నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

కాగా- నారా లోకేష్ పోస్ట్ చేసిన ట్వీట్ కు కర్ణాటక వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఎం బీ పాటిల్ ఘాటుగా స్పందించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి కర్ణాటక భూమిని మాత్రమే అందించట్లేదని, తమ రాష్ట్రం అత్యుత్తమ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను దేశానికి అందిస్తోందని అన్నారు.

తాము దశాబ్దాలుగా దేశంలోనే అత్యంత బలమైన ఏరోస్పేస్ బేస్ ను నిర్మించామని ఆయన నారా లోకేష్ కు గుర్తు చేశారు. ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65 శాతం వాటా కర్ణాటక అందిస్తోందని చెప్పారు. ఈ రంగంలో తాము జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నామని, ప్రపంచవ్యాప్తంగా 3 వ స్థానంలో ఉన్నామని ఎంబీ పాటిల్ అన్నారు.

తాము ఏరోస్పేస్ ఇండస్ట్రీ పార్క్ ను వదులుకున్నది, భూమి గురించి మాత్రమే కాదని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంబీ పాటిల్.. నారా లోకేష్ కు తెలిపారు. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మాకు బాగా తెలుసునని, ఏ ఒక్కటీ చేజారిపోదని అన్నారు.

కర్ణాటక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకున్న మొదటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని ఎంబీ పాటిల్ అన్నారు. ఏరోస్పేస్ మాత్రమే కాదు.. అనేక కొత్త పరిశ్రమలు ఎప్పటికీ కర్ణాటకను ఎంచుకుంటూనే ఉన్నాయని, ఉన్న పరిశ్రమలు ఇక్కడ విస్తరిస్తూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now