నేడు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం. ప్రతి సంవత్సరం జులై 1వ తేదీన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ డే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కు సంబంధించినంత వరకూ ఇది అత్యుత్తమ హోదాగా చెప్పుకోవచ్చు. అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో వీరికి ఉన్న నైపుణ్యం అసాధారణం.
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో సీఏల పాత్ర కీలకం. ఫైనాన్షియల్ రిపోర్టులను తయారు చేయడం, ఆర్థిక దుర్వినియోగాన్ని పసిగట్టడం- దాన్ని అరికట్టడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వడం, వాటిని ఆడిట్ చేయడం, పన్ను చెల్లింపుల వంటివి.. వీరి పరిధిలోనే ఉంటాయి.
అలాంటి ప్రాధాన్యత గల రంగంలో ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్ల కోసం ప్రతి సంవత్సరం జులై 1వ తేదీని సీఏ డే గా జరుపుకొంటారు. దీన్ని పురస్కరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా ఛార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏలు ప్రధాన పాత్ర పోషిస్తోన్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలను అందించడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అనేక కార్పొరేటర్ సంస్థలు విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగింపజేయడంలో సీఏల పాత్ర ఉందని కితాబిచ్చారు.
సీఏల ఖచ్చితత్వం, నైపుణ్యం.. ప్రతి సంస్థకు అత్యవసరమ ని మోదీ అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తోన్నారని ప్రశంసించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగంలో మరింత మంది అడుగు పెట్టాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లకు విషెస్ తెలియజేశారు. తన తోటి చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ CA Day శుభాకాంక్షలు అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సీఏలు.. ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాల వంటి వాళ్లని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi