సీమ మీద ఫుల్ ఫోకస్...జగన్ మీదనే గన్! టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే అంతా చేస్తున్నారు.


ANDHRAPRADESH:టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే అంతా చేస్తున్నారు. ఆయన ఒక వైపు ఏపీలో పాలనను గాడిలో పెడుతూనే మరోవైపు రాజకీయంగా కూడా జగన్ ని పూర్తిగా నియంత్రించాలని కంకణం కట్టుకున్నారు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా వైసీపీ ప్రాణం అంతా రాయల జిల్లాలలోనే ఉంది. ఆ సంగతి బాగా తెలిసిన చంద్రబాబు అక్కడ నుంచే వైసీపీ పతనానికి పావులు కదుపుతున్నారు.

ఆయన తరచూ సీమ జిల్లాలకు వెళ్తున్నారు నిన్న గాక మొన్న శ్రీశైలం వెళ్ళి క్రిష్ణమ్మకు జల హారతి ఇచ్చారు. ఇపుడు ఆయన నంద్యాల వెళ్ళి అక్కడ హంద్రీ నీవా జలాలను వదిలారు. ఆయన రాయలసీమకు ఎపుడు వెళ్ళినా చెప్పే మాట ఒక్కటే తాను కూడా సీమ బిడ్డనే అని. అంతే కాదు వెనకబడిన రాయలసీమకు న్యాయం చేయాలని తపన తనకే ఉందని బాబు చెప్పుకొస్తున్నారు.

సీమలో ప్రతీ ఎకరాకూ సాగునీరు ఇస్తామని బాబు అభయం ఇస్తున్నారు. సీమలో ఎన్నో పరిశ్రమలు తీసుకుని వస్తామని బాబు హామీ ఇస్తున్నారు. హైకోర్టుని తొందరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కడపలో ఉక్కు కర్మాగారని నెలకొల్పుతామమని కూడా చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. అదే విధంగా ప్రముఖ పరిశ్రమలను రాయలసీమ జిల్లాలలో ఏర్పాటు చేస్తామని అన్నారు.

అయితే ఇవన్నీ చేయాలంటే ప్రజలు తనకు సహకరించాలని బాబు కోరారు. తనకు మరింతగా బలం ఇవ్వాలని అన్నారు. అంతే కాదు తాను యాగం చేస్తూంటే అడ్డుకుంటున్న వ్యతిరేక శక్తులను పూర్తిగా కట్టడి చేయాలని ఆయన కోరారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న భూతాన్ని భూస్థాపితం చేసే విషయంలో సహకరించాలని బాబు పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావించారు

పరిశ్రమలు పెట్టడానికి అభివృద్ధి చేయడానికి అంతా ముందుకు వస్తారని అయితే భూతం మళ్ళీ వస్తుందేమో అన్న భయాలు వారిలో ఉన్నాయని ఆ విధంగా రానీయమని ప్రజలు కూడా గట్టిగా చెప్పాలని బాబు కోరుతున్నారు. ఇక మతాలు కులాలు అన్నవి అభివృద్ధికి అడ్డు కాకూడని బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మొత్తం మీద చూస్తే రాయలసీమ గడ్డ మీద జగన్ కి వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న ప్రాంతం నుంచే భూతాన్ని బంధించేద్దాం కలసి రమ్మని జనాలను కోరుతున్నారు. మరో వైపు బనకచర్ల ప్రాజెక్ట్ ని బాబు తలకెత్తుకోవడని వెనక కూడా రాయలసీమ ప్రాంతాలలో టీడీపీకి శాశ్వతమైన అభిమానం సంపాదించాలన్న వ్యూహం ఉందని అంటున్నారు.

వైసీపీకి సీమలో ఆదరణ దక్కితే దాని ప్రభావం మిగిలిన ప్రాంతాలలో కూడా పడుతుందని అందుకే మొదటికే దెబ్బ తీసేలా వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా సీమలో బాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా సీఎం జిల్లాలు మొత్తం టీడీపీ కూటమికి జైకొట్టాయి ఆ అభిమానాన్ని జనాదరణను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now