ANDHRAPRADESH:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నియామకం చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలూరు సాంబశివరారెడ్డి నియమితులు అయ్యారు. అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వెల్లడించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల కారణంగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుబాటులో లేనందున ఆయన స్థానంలో ఆలూరు సాంబశివారెడ్డిని నియమించినట్లు వివరించింది.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఓ అధికారిక ప్రకకటన విడుదల చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదల అయి, తిరిగి వచ్చేంత వరకూ ఆలూరు సాంబశివారెడ్డి తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఈ ప్రకటనలో పేర్కొంది. ఆలూరు సాంబశివారెడ్డి సొంత జిల్లా అనంతపురం. ఆవిర్భావం నుంచి ఆయన వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోన్నారు.
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బెంగళూరు విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉంటోన్నారు. విజయవాడ జిల్లా జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో ఆయన అనుచరులు బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ కూడా అరెస్ట్ అయ్యారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్ అరెస్టును నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలను చేపడుతూ వస్తోన్నారు. తాజాగా యర్రావారిపాళెంలో నాయకులు, కార్యకర్తలురోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నల్లజెండాలు చేతబట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi