HYDERABAD:వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొండ మురళి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించక తప్పని పరిస్థితి చోటుచేసుకుంది. ఈ సమయంలో కూడా కొండా దంపతులు ఏమాత్రం తగ్గకుండా తమదైన అడుగులు వేస్తున్నారు.
కొండా దంపతులు వర్సెస్ వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు
తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా దంపతులు కావాలా తాము కావాలా తేల్చుకోమని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారి పైన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.
మీనాక్షి నటరాజన్ ను కలిసిన కొండా దంపతులు.. వివరణ లేఖ
దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వారిద్దరిని పిలిచి మాట్లాడారు. వారి వివరణ తీసుకున్నారు. కొండా దంపతులు 16 పేజీలలో వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతల పైన, వారు చేస్తున్న వ్యవహారాల పైన నివేదిక ఇచ్చారు. తర్వాత తాము ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సంకేతాలను ఇచ్చారు. తాము బలహీనవర్గాలకు ప్రతినిధులమని, ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేశారు.
చాలా కేసులకే భయపడలేదు: కొండా మురళి
ఒకరిపై ఎప్పుడూ తాము కామెంట్లు చేయమని కొండ మురళి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. తనకు ప్రజాబలం ఉందని, చాలా కేసులకి తాను భయపడలేదని, తనకు భయం లేనే లేదని మొదటినుంచి చెబుతున్నాను అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని కొండా మురళి పేర్కొన్నారు
గ్రూప్ రాజకీయాలతో మాకు సంబంధం లేదు
సుస్మిత రాజకీయాన్ని సమర్ధించిన కొండా సురేఖ స్థానిక సంస్థల ఎన్నికలలో వరంగల్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా పని చేస్తామన్నారు కొండా మురళి. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోయినా జడ్పిటిసి లను, ఎంపీటీసీ లను గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానన్నారు.కొండా సురేఖ మాట్లాడుతూ తమ కుమార్తె రాజకీయాన్ని సమర్ధించారు. సుస్మిత రాజకీయ ఆలోచనలను తాము తప్పు పట్టలేమని, తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం ఆమెకు ఉందని, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామన్నారు.
తగ్గకుండా సమాధానమిచ్చిన కొండా కపుల్.. వాట్ నెక్స్ట్
ఇక తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని సురేఖ పేర్కొన్నారు. తాను నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు మంత్రిగా ఇప్పటివరకు ఎటువంటి తప్పులు చేయలేదన్నారు. ఇక మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా ఏమాత్రం తగ్గకుండా కొండా సురేఖ దంపతులు సొంత పార్టీ నేతల పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు . ఇక కొండ సురేఖ దంపతుల తీరుతో అధిష్టానం వారి వ్యవహారంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా చూస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.

Shakir Babji Shaik
Editor | Amaravathi