నోటికి పని చెప్పే విషయంలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రదర్శించే టాలెంట్ ఆయనకు మాత్రమే సాధ్యం.
నోటికి పని చెప్పే విషయంలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రదర్శించే టాలెంట్ ఆయనకు మాత్రమే సాధ్యం. అధికారంలో ఉన్నప్పుడు ఒంటికాలి మీద లేచే నేతలు కొందరుంటారు. అందుకు భిన్నంగా అధికారం లేనప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించే తీరు కొందరు నేతలకే సొంతం. ఆ కోవలోకే వస్తారు పేర్నినాని. రెండు మూడు రోజుల క్రితం ఆయన ఫోన్ కాల్ వీడియో బయటకు రావటం.. అది కాస్తా సంచలనంగా మారటం.. రాజకీయాల పేరుతో వర్గాల మధ్య గొడవలు పెట్టేలా ఆయన ప్లానింగ్ చూసిన వారంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా పెడనలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మరోసారి తన నోటికి పని చెప్పారు పేర్ని నాని.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం మాత్రమే కాదు టీడీపీ వర్గీయుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోల్ని ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు. ఆయన మాటలు ఎంతలా ఉన్నాయనటానికి నిదర్శనంగా శాంపిల్ మాటల్ని చూస్తే.. ‘‘76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంత కాలం బతుకుతావ్? 50 ఏళ్ల జగన్ ను భూస్థాపితం చేస్తావా? అది నీ తరమా? నీ కొడుకు తరమా? అంటూ నోరు పారేసుకున్నారు
రాష్ట్రంలోని పచ్చ మహిళలతో తనను తిట్టిస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘అరేయ్.. నేను అనాలంటే పట్టపగలే వేసేయమని చెబుతాన్రా. చీకటిలో నరికేయండని అనలేదు. వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేశ్ మాట్లాడాడు. ఐదు నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు. ఏం చేశావ్’ అంటూ అవమానకరంగా మాట్లాడిన పేర్ని నాని.. ‘‘ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుబివాడలో అడుగు పెడుతున్నా.. ఎవడొస్తాడో రండ్రా.. దమ్ముండే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం’ అంటూ రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని టీడీపీకి చెందిన పలువురు నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు 80 ఏళ్లు వచ్చినా చావలేదంటూ స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆయన్ను దూషించారు. కొల్లు రవీంద్రను సొల్లు రవీంద్రగా పేర్కొంటూ.. అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమీషన్లు తింటున్నాడన్నారు. కొల్లు రవీంద్ర 45 ఎకరాలు అక్రమించారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వ్యాఖ్యానించారు.
ఓరేయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినటం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినటం లేదు. బందరు బీచ్ లో ఇసుక తింటున్నావు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయిలు లేదు. కానీ.. ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు డబ్బులు ఎక్కడివి? ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినటం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’ అంటూ హెచ్చరించారు. రప్పా రప్పా అనొద్దని తాను వైసీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్ లో చెప్పానని.. ఎవరినీ నరకమని చెప్పలేదన్నారు. అయినా తన మీద టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో డిబేట్ పెట్టించి.. తిట్టించారన్నారు.
పేర్ని నాని తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. ఫోన్ కాల్ వీడియో ఉదంతాన్ని మరిచిపోయేందుకు కష్టపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గీతను చిన్నది చేయటానికి పెద్ద గీతను గీసే వ్యూహానికి తగ్గట్లే.. రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన తన ఫోన్ కాల్ వీడియో నుంచి ఫోకస్ తప్పించేందుకు వీలుగా మరింత వివాదాన్ని రగిలించేలా ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు. మొత్తంగా పేర్ని నాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయని చెప్పక తప్పదు. మరి.. దీనిపై టీడీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi