AP Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహుర్తం ఫిక్స్..! మంత్రి ప్రకటన..


ANDHRPRADESH:ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఈ వివరాలను ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు.

ఏపీలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. క్యూఆర్ కోడ్‌లతో డిజిటల్ రేషన్‌కార్డులు ఉంటాయన్నారు. ఆగస్టు 25 నుంచి వారం రోజుల పాటు కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామన్నారు. కొత్త రేషన్‌కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండవని ఆయన తెలిపారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని మంత్రి మనోహర్ వెల్లడించారు. డైనమిక్ కీ రిజిస్టర్ తో వీటిని అనుసంధానిస్తామన్నారు. దీంతో ప్రతీ లావాదేవీ జరగగానే తమ ఆఫీసులో తెలిసిపోతుందన్నారు.

ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటినవారికి ఈకేవైసీ అవసరంలేదని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందన్నారు. 25నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రేషన్ కార్డుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15.32 లక్షల దరఖాస్తుల్ని ఆమోదించినట్లు మనోహర్ తెలిపారు. 9.87 లక్షల మందికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దీంతో కలిపి కోటీ 45 లక్షలకు చేరుకుందన్నారు. సభ్యులతో కలిపి 4 కోట్లు దాటి ఉన్నట్లు మంత్రి తెలిపారు.

రేషన్ కార్డుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేే విధంగా రాష్ట్రంలో ఈకేవైసీ వ్యవస్దను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 11 లక్షల 47 వేల మందికి ఈకేవైసీ అవసరం లేదని గుర్తించామన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆయన తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో 4200 మంది పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గ్యాస్ సిలెండర్ల డబ్బుల్ని డిజిటల్ వాలెట్ లోకి జమ చేస్తున్ననట్లు తెలిపారు. ఈ డబ్బులు ఇతర అవసరాలకు వాడుకోలేరని తెలిపారు. ఖాతాలు సరిగా లేని 86 వేల మందికి మాత్రం గ్యాస్ సబ్సిడీ మొత్తం జమ చేయలేకపోయామని, వారికి నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా జమ చేయిస్తామన్నారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now