బుడమేరు పొంగుతోంది..! విజయవాడలో మళ్లీ వరదలు..! ఈ వార్తలో నిజమెంత..

ANDHRAPRADESH:బుడమేరు వాగు పేరు వినగానే గతేడాది జరిగిన విధ్వంసమే గుర్తుకొస్తుంది. భారీ వర్షాల ధాటికి బుడమేరు పొంగి విజయవాడను అతలాకుతలం చేసింది. ఆ వరదల నుంచి విజయవాడ ప్రజలు తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. అయితే తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుడమేరు మళ్లీ పొంగుతోంది అంటూ.. విజయవాడకు మరోసారి వరద ముప్పు తప్పదంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో వరదలు వస్తాయని పుకార్లు సృష్టిస్తున్నారు. దీంతో.. బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అలాంటిదేమీ లేదని.. అది తప్పుడు ప్రచారం మాత్రమేనని.. వాస్తవం కాదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

బుడమేరు పొంగింది.. విజయవాడలో వరదలు అంటూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఈ తప్పుడు వార్తలు నమ్మొద్దని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. పోలీసు జీపుతో YSR కాలనీకి వచ్చిన పోలీసులు.. అక్కడి కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి వరదలు రావడం లేదని తప్పుడు వార్తలు నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతం వరదలు వచ్చే ఎలాంటి సూచనలు లేవని తెలిపారు. మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోపాటు కీసర, మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

అంతేకాక శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజులు కృష్ణా నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 20,748 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతుందని వివరించారు. ఈ మేరకు బ్యారేజీ 25 గేట్లను అడుగు మేరకుపైకి ఎత్తి 18,125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. అటు కాలువల ద్వారా 2,623 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు తెలిపారు. మరోవైపు భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇబ్రహీంపట్నం- రాయపూడి మధ్య లాంచీల ప్రయాణం తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించారు.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now