ANDHRAPRADESH:అన్నదాత సుఖీభవ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ నెలలోనే ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేసింది. అర్హుల జాబితా దాదాపు ఫైనల్ అయింది. అభ్యంత రాలు ఉంటే చెప్పేందుకు సమయం ఇచ్చింది. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న ఈ పథకం నిధులు రైతుల ఖాతా ల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా కౌలు రైతుల విషయంలో కొత్త మెలిక సమస్యగా మారుతోంది. వీరికి పథకం అందుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది.
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కలిపి నిధులు జమ చేసేలా నిర్ణయం జరిగింది. కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ నిధులను ఆగస్టు 2న విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. కాగా, ఇప్పటికే అన్నదాత సుఖీ భవ లబ్దిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే, ఈ జాబితాల్లో కౌలు రైతుల పైన స్పష్టత లోపించిందని చెబుతన్నారు. ప్రస్తుతం పంట సాగు హక్కుదారుల పత్రం (సిసిఆర్‌సి కార్డు) ఉన్న వారు, గతంలో రైతు భరోసా అందుకున్న వారికి ఈ జాబితాల్లో అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాలేదనే సాకుతో వారికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. కౌలు కార్డులు దక్కినా, దాని ఫలితం మాత్రం కౌలు రైతులు పొందలేకపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పది లక్షల మంది కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ రెండో వారంలో కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టింది. కౌలు రైతులకు రెండు కేటగిరీల్లో కార్డులను జారీ చేసింది. ఇప్పటివరకు మొత్తం 4,58,987 మందికి జారీ అయ్యాయి. సర్వే నంబర్లు ఆధారంగా 2,86,383 మందికి, భూ సమగ్ర సర్వే జరిగిన చోట ల్యాండ్ పార్శిల్ మ్యాప్ ఆధారంగా 1,72,604 మందికి అందించింది. కౌలు రైతులను గుర్తించి సిసిఆర్‌సి కార్డుల జారీని సులభతరం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ భూమిపై భవిష్య త్తులో కోర్టులకు వెళ్తారన్న భయం, పిఎం కిసాన్, రైతు భరోసా, అన్నదాతా సుఖీభవ వంటి పథ కాలు తమకు రావనే ఉద్దేశంతో అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు చాలాచోట్ల భూ యజ మానులు అంగీకరించలేదు.
పూర్తి కాని ప్రక్రియ
తూర్పుగోదావరి జిల్లాలో 1.10 లక్షల మందికి కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 4,63,595 మందికి మాత్రమే అందింది. ఎన్‌టిఆర్ జిల్లాలో 56 వేల మందికి కార్డులను అందించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకూ 37,739 మందికి జారీ అయ్యాయి. వైఎస్‌ఆర్ కడపలో 11 వేల మందికి కౌలు కార్డులు ఇవ్వాలనే లక్ష్యం కాగా, 2,919 మందికి మాత్రమే అందాయి. అర్హులైన వారందరికీ సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయాలని, అందరికీ అన్నదాతా-సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని కౌలు రైతుల నుంచి డిమాండ్ ఉంది. గతంలో ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు లబ్దిదారుల జాబితాలతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో, ప్రభుత్వం సానుకూల నిర్ణయం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు.