మిథున్ రెడ్డికి జైలు వేళ.. పెద్దిరెడ్డికీ చంద్రబాబు మరో షాక్..!


ANDHRAPRADESH:ఏపీలో ఇద్దరు సీనియర్ నేతలు సీఎం చంద్రబాబు, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న వైరం అందరికీ తెలిసిందే. తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా వీరు తమ ప్రత్యర్దుల్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు అంగళ్లు టూర్ కు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో దాడులు చేయించి ఎదురు కేసులు పెట్టించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి వంతు వచ్చింది.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, మద్యం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయన్ను తాజాగా జైలుకు పంపారు. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇప్పుడు తండ్రి పెద్దిరెడ్డి అన్నీ చూసుకుంటున్నారు. రాజమండ్రిలో ఓ క్యాంప్ హౌస్ తీసుకుని అక్కడి నుంచే భోజనం వండించి తీసుకెళ్తున్నారు. అలాగే మిథున్ రెడ్డికి కావాల్సిన ఇతర సామాగ్రి కూడా స్వయంగా తీసుకెళ్లి అందిస్తున్నారు.

ఇదే క్రమంలో తనతో పాటు గన్ మెన్ కాలేషాను కూడా తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు వెళ్తున్నారు. అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి గన్ మెన్ అయినా ఆయన వ్యక్తిగత పనుల వరకూ ఓకే కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సామాన్లు మోసుకుంటూ జైలుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. బహిరంగంగానే జరిగిన ఈ ఘటనపై విమర్శలు రావడంతో పెద్దిరెడ్డి గన్ మెన్ కాలేషాపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెన్షన్ వేటు వేశారు.

ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత తన చిరకాల రాజకీయ ప్రత్యర్ది చంద్రబాబు చేతిలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది మరో షాక్ గా మారింది. ఇప్పుడు మరో గన్ మెన్ ను కేటాయించినా ఆయన పెద్దిరెడ్డితో పాటు జైలుకు వెళ్లే అవకాశాలు మాత్రం ఉండవు. దీంతో స్వయంగా అన్ని సామాన్లు మోసుకుంటూ కొడుకు మిథున్ రెడ్డికి అందించడం ఇప్పుడు పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారనుంది.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now