కేబినెట్ నుంచి పవన్ బర్తరఫ్..! మంత్రిగా ఉంటూ సినీ ప్రమోషన్సా ?

ANDHRAPRADESH:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మంత్రిగా, ప్రజాప్రతినిథిగా ఉంటూ సొంత లాభం కోసం పనిచేస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రమాణస్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలను, పాటించాల్సిన నిబంధనలు ఏపీలో అమలు కావడం లేదని, ముఖ్యంగా స్వలాభం చూసుకోనంటూ అంతఃకరణశుద్ధితో చేసిన ప్రమాణాలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

పంచాయతీ రాజ్, అటవీశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ రాజ్యాంగాన్ని, అందులోని నిబంధనలను పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రెయినేజీల వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పవన్ మాత్రం సినిమాలు తీసుకుంటున్నారని విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజాప్రతినిథిగా, మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడమే తప్పు అని రాజ్యాంగంలోని నిబంధనలు చెబుతుంటే పవన్ కల్యాణ్ మాత్రం.. హరిహరవీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని విమర్శించారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు.

సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కల్యాణ్.. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని, మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూదడదనే నిబంధన పవన్ కల్యాణ్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కల్యాణ్ తన తప్పును బహిరంగంగానే ఆంగీకరించారని విజయ్ కుమార్ వెల్లడించారు.

అవినీతి నిరోధక చట్టం-1988 ప్రకారం ప్రజాప్రతినిథిగా ఉన్న వ్యక్తి సొంతలాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని తెలియదా..? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిథిగా, మంత్రిగా ఉంటూ నిబంధనలు తుంగలొ తొక్కి అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కల్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కల్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అవినీతి నిరోధక శాఖ డీజీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

టికెట్ ధరలు పెంచాలంటే ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు వచ్చి అడగాలని ఆదేశాలిచ్చిన పవన్ కల్యాణ్.. తానే స్వయంగా టికెట్ ధరలు పెంచుకునేలా జీవో ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి సినిమా షూటింగ్‌కి వెళ్లాలంటే, ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని చెప్పి.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని.. కానీ పవన్ అలా చేయలేదని.. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వివరించారు. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ కల్యాణ్.. విమర్శలు చేసిన వారిపై తిరగబడాలని తన అభిమానులను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now