ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15,16 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటన లో బనకచర్ల ప్రాజెక్టు పైన కేంద్రంతో చర్చిస్తారు. ఇక, సుదీర్ఘ కాలం తరవాత మరోసారి చంద్రబాబు సింగపూర్ బాట పడుతున్నారు. మంత్రులు.. అధికారులతో కలిసి చంద్రబాబు అయిదు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం తో పాటుగా మంత్రులు లోకేష్.. నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ వెళ్లనున్నారు. 2014-19 కాలంలో రాజ ధాని అమరావతిగా ఖరారు అయిన తరువాత మాస్టర్ ప్లాన్ తో పాటుగా సింగపూర్ కన్సెల్టెన్సీ లు కీలక పాత్ర పోషించాయి. అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పలు సందర్భాల్లో ఏపీలో పర్యటిం చారు. చంద్రబాబు టీం అప్పట్లో సింగపూర్ ను పలు మార్లు సందర్శించారు. సింగపూర్ టీం రాజధాని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించింది.
ఇక, 2019 లో టీడీపీ ఓడిపోయిన తరువాత సింగపూర్ తో సంప్రదింపులు నిలిచిపోయాయి. తిరిగి 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయిన తరువాత మరోసారి సింగపూర్ తో భాగస్వామ్యం గురించి కేంద్రంతోనూ చర్చించారు. ఇప్పుడు రాజధాని వ్యవహారాల పైన సింగపూర్ తో చర్చల కోసం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ సారి పర్యటనలో ఏపీ కి సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు పై చర్చ చేస్తారని తెలుస్తోంది. అదే విధంగా రాజధాని మాస్టర్ ప్లాన్ ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సింగపూర్ కేంద్రంగా చంద్రబాబు టీం చేసుకునే ఒప్పందాలు.. నిర్ణయాలు ఇప్పుడు అమరావతి భవిష్యత్ లో కీలకంగా మారనున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi