ANDHRAPRADESH:ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలు పెట్టారు. నాటి ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన అంశాల పైన ఫోకస్ చేసారు. తప్పులను సరి దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతల పైన వరుస కేసుల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ ముఖ్యులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
మారుతున్న లెక్కలు
మాజీ సీఎం జగన్ బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. వైసీపీలోకి చేరికల ను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీలు అధికారంలో ఉండటంతో.. ఆ మూడు పార్టీలను వ్యతిరేకించే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందు కోసం తన పార్టీలోని సీనియర్ నేతలతో గతం కంటే భిన్నంగా కీలక అంశాల్లో అభిప్రాయాలకు ప్రాధాన్యత పెంచారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు పార్టీ నేతల సమాచారం. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో జగన్ తో సమావేశం అయినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రావటం ద్వారా.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. ఆ సమయంలో తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
జగన్ కీలక మంత్రాంగం
తూర్పు గోదావరికి చెందిన కాంగ్రెస్ నేత నేరుగా జగన్ తో సంప్రదింపులు చేసారు. ఆయన తన వారసుడిని పార్టీలో చేర్చే అంశం పైన చర్చించినట్లు సమాచారం. ఆయన్ను కూడా పార్టీలోకి రావాలని జగన్ సూచించారు. ఇందుకు ఆ నేత సమ్మతించినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నేత తో పార్టీలో కొంత కాలం క్రితం చేరిన శైలజానాధ్ మాట్లాడారు. ఆ తరువాత జగన్ తోనూ నేరుగా మాట్లాడించినట్లు సమాచారం. అటు చీరాల నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమంచి క్రిష్ణ మోహన్ సైతం తిరిగి వైసీపీ లోకి రావటానికి సిద్దం అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనసేన వైపు ఆమంచి ఆసక్తిగా ఉన్నా.. ఆ పార్టీ నుంచి సీటు దక్కే అవకాశం కనిపించటం లేదని సమాచారం.
ఇక, కాంగ్రెస్ నుంచి పోటీ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మరో ముగ్గురు నేతలు వైసీపీలోకి రావటం దాదాపు ఖాయమైంది. వీరంతా ఆగస్టు 15న పార్టీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ నేతలు వైసీపీ ముఖ్య నేతలతో చర్చించారు. చివరగా జగన్ తో చర్చించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే సీమ నుంచి టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన సుగవాసి బాల సుబ్రమణ్యం వైసీపీలో చేరారు. అనంతపురం లో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్దం అయ్యారని సమాచారం. ఇప్పటికే పార్టీలో చేరిన సాకే శైలజానాధ్ ద్వారా మరికొందరు కీలక నేతలను పార్టీలో చేరేలా రాయబారం నడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పైన ప్రభావం చూపాయి. దీంతో, ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలే టార్గెట్ గా బెంగళూరు నుంచి జగన్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi