ANDHRAPRADESH:ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. లిక్కర్ కేసు ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల మెడకు చుట్టుకుంటోంది. వరుస అరెస్ట్ లతో జగన్ కొత్త కార్యాచరణ కు సిద్దం అవుతున్నారు. ఈ కేసులో జగన్ ప్రమేయం పైన ఛార్జ్ షీట్ లో ప్రస్తావన చేసారు. అటు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు మారుతున్నాయి. దీంతో.. జగన్ రూటు మార్చారు. పార్టీ ముఖ్య నేతల భేటీలో కీలక ప్రకటనకు సమాయత్తం అయ్యారు.
కీలక మంత్రాంగం
మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిణామాలతో అప్రమత్తం అయ్యారు. ఈ రోజు బెంగళూరు నుంచి రానున్న జగన్ రేపు (మంగళవారం) పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 31న జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డికి వెళ్లనున్నారు. వచ్చే వారం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారు. కాగా, రేపు జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో జగన్ కీలక అంశాలను పార్టీ నేతలతో చర్చించనున్నారు. పార్టీ ముఖ్య నేతల వరుస అరెస్ట్ ల వేళ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అదే విధంగా భవిష్యత్ పరిణామాల పైన పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు.
ఎప్పుడు ఏం జరిగినా
ప్రస్తుతం లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారతి సిమెంట్స్ లోనూ సెట్ సోదాలు.. విచారణ చేయటం సంచలనంగా మారుతోంది. అటు సీఎంఓ లో లిక్కర్ కు సంబంధించి ఎలాంటి చర్చలు.. నిర్ణయాలు జరగలేదని జగన్ చెబుతూ వస్తున్నారు. కాగా, పార్టీ ముఖ్య నేతలు అరెస్ట్ తరువాత సెట్ తదుపరి ఛార్జ్ షీట్ లో జగన్ గురించి ఏం ప్రస్తావన చేస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. కూటమి ముఖ్య నేతలు సైతం జగన్ అరెస్ట్ పైన పలు మార్లు వ్యాఖ్యలు చేసారు. సిట్ దూకుడు.. కూటమి నేతల వ్యూహాల పైన జగన్ ఇప్పటికే అలర్ట్ అయ్యారు. న్యాయపరంగా ఈ కేసు గురించి బెంగళూరు కేంద్రంగా సీనియర్ న్యాయవాదులతో మంత్రాంగం సాగించినట్లు తెలుస్తోంది.
ఇక జనంలోనే
కాగా, పీఏసీ సమావేశంలో భవిష్యత్ లో ఎలాంటి పరిణామా లు చోటు చేసుకున్నా.. ముందుకే వెళ్లే విధంగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఢిల్లీకి వెళ్లి ఏపీలో అరెస్ట్ ల గురించి ఫిర్యాదులు చేయాలని భావించినా.. కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామిగా ఉండటంతో ఉపయోగం లేదనే అభి ప్రాయానికి వచ్చారు. దీంతో, ఏపీలోనే ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి అనేది జగన్ తాజా ఆలోచన. అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు జగన్ సమాయత్తం అవుతున్నారు. పూర్తిగా పార్టీ శ్రేణులు - జనం మధ్యనే ఉండేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. అదే సమయంలో త్వరలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ అనివార్యం అయితే.. పార్టీ వైఖరి పైనా జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.