ANDHRAPRADESH:నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రత్యేక అలర్ట్‌ను జారీ చేసింది.
ఎగువ ప్రాంతాల వర్షాల వల్ల నదులకు భారీగా వరద నీరు చేరుతుందని వెల్లడించింది. ప్రస్తుతం వరద ప్రవాహం ఇంకా హెచ్చరిక స్థాయికి చేరుకోకపోయినా.. నదీ ప్రాజెక్టుల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు గ్రామాల్లో నివసించే వారు ముందస్తుగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని తెలిపింది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిజమైన సమాచారానికి ప్రభుత్వ ప్రకటనలనే ఆధారంగా తీసుకోవాలని APSDMA స్పష్టం చేసింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, బోటింగ్ చేయడం వంటి చర్యలను నివారించాలని కోరింది.
భద్రాచలం వద్ద నీటి మట్టం రాత్రి 7 గంటల సమయానికి 35.3 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 4.44 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో నమోదైంది. కృష్ణా డెల్టా, గోదావరి తీర ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుండి నీటి విడుదల పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల అధికారులను హై అలర్ట్‌లో ఉంచారు.
APSDMA వర్ష సూచన ప్రకారం, ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పరవతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వేగంగా గాలులు, వడగళ్ల వర్షం వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలుగా లోతట్టు గ్రామాల్లో సహాయక బృందాలు, నిఘా బృందాలను మోహరించింది. రిలీఫ్ సెంటర్లు, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, రహదారులు, వంతెనలు, ప్రాజెక్టు గేట్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో అవసరంలేకుండా తిరగకూడదని, పుకార్లను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే నమ్మాలని APSDMA ప్రత్యేకంగా సూచించింది.