ANDHRPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని, నేతల్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో ఆధారాలతో సహా ఫిర్యాదులు నమోదు చేయాలని, వాటిపై అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరికైనా, ఏ అధికారితో అయినా వేధింపులు ఎదురైతే యాప్ లోకి వెళ్తే ఎలా అన్యాయం జరిగిందని అడుగుతుందని, అక్కడ ఎవరు తమను ఎలా వేధించారో ఫిర్యాదు చేయొచ్చని వైఎస్ జగన్ తెలిపారు. అలాగే ఆధారాలు ఉంటే అప్ లోడ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. బటన్ నొక్కితే ఆ ఫిర్యాదు వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తుందన్నారు. తాను సీఎం అయ్యాక ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసి ఎవరెవరికి ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసుకుని, చేసిన వాళ్లను, ఎవరి ప్రోద్భలంతో చేశారో, ఆధారాలు చూసి చర్యలు తీసుకుంటామన్నారు.
వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టి సినిమా చూపిస్తామన్నారు.చేసిన వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఏదైతో విత్తుతారో అదే రేపు పండుతుందన్నారు. పది రోజుల్లో ఈ యాప్ రిలీజ్ చేస్తామన్నారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో మరింత చురుగ్గా పాల్గొనాలని జగన్ పీఏసీ సభ్యులకు సూచించారు. గ్రామ కమిటీలను సమర్ధంగా తయారు చేసుకునేందుకు ఇదో అవకాశం అన్నారు.
చంద్రబాబు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోందని, వైసీపీని పోగొట్టుకున్నామనే బాధ అందరిలో కనిపిస్తోందన్నారు.తమ హయాంలో అందుతున్న ఫలాలు ఇప్పుడు రావడం లేదనేది కనిపిస్తోందన్నారు. చంద్రబాబు వచ్చాక అందుతున్న ప్లేటు తీసేసి, ఇస్తానని చెప్పిన బిర్యానీ చూస్తే ఉన్న పలావు కూడా పోయిందనేది అర్థమైందన్నారు. గ్రామ స్ధాయిలో విపరీతమైన కదలిక వస్తుందని, దాన్ని క్రమపద్ధతిలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రస్ధాయిలో కార్యక్రమాలు రూపొందించే నాటికి గ్రామ కమిటీల్ని సమర్ధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందులో క్రియాశీలక పాత్ర పోషించాలని పీఏసీ సభ్యుల్ని కోరారు.