కృష్ణా రాజకీయంలో బిగ్ టర్న్..! ఉప్పాల హారిక ఎపిసోడ్ ఎవరికి ప్లస్ ?


ANDHRAPRADESH:ఏపీలో గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత తిరిగి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి కృష్ణా జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్లస్ అవుతున్నాయి. ఇప్పటికే సర్వేల్లో జిల్లాలోని గుడివాడ, బందరు వంటి సీట్లలో కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిపోయింది. గత ఎన్నికల్లో ఏకపక్ష విజయం తర్వాత జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతున్నట్లు అర్దమవుతోంది.

కృష్ణా జిల్లా రాజకీయంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, బందరు. ఈ మూడు చోట్ల గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి గత ఎన్నిక్లలో ఓటమిపాలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని అత్యంత సన్నిహత మిత్రులే. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన వీరిని స్ధానిక టీడీపీ నేతలు కెలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు వారికి షాక్ లు ఇస్తున్నాయి. వీటి ఫలితమే తాజాగా ఉప్పాల హారిక ఘటన.

గత ఎన్నికల్లో విజయాల తర్వాత కృష్ణాజిల్లాలోని ఈ మూడు సీట్లలో పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పాటు గతంలో ఇక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చేసిన పనులకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా బందరులో పేర్ని నాని కుటుంబంపై వరుసగా కేసులు నమోదు చేసారు. ఆ తర్వాత గన్నవరంలో వల్లభనేని వంశీని టార్గెట్ చేసి జైలుకు పంపారు. ఆరోగ్యం బాగా లేకున్నా జైళ్లు, స్టేషన్ల చుట్టూ తిప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపైనా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినా ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడంతో టార్గెట్ చేయలేకపోతున్నారు.

మరోవైపు కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గా గత వైసీపీ హయాంలో ఎన్నికైన ఉప్పాల హారికతో పాటు గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె భర్త ఉప్పాల రాము కూడా పెద్దగా మాటల దాడి, సై అంటే సై అనే రాజకీయాలు చేసే వాళ్లు కాదు. ఇదే వారికి మైనస్ కూడా అవుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు మ్యానిఫెస్టో అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ పెట్టుకున్న ప్రోగ్రామ్ కు వెళ్తున్న ఉప్పాల హారికతో పాటు ఆమె భర్త రాము కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అక్కడితో ఆగకుండా కారుపై దాడి చేశాయి. ఈ ఎపిసోడ్ లో ఎవరికీ భారీగా గాయాలు కాకపోయినా ఈ వ్యవహారం రాజకీయంగా టీడీపీకి మైనస్ అయింది.

అదే సమయంలో బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు మద్దతుగా పైన చెప్పిన మూడు నియోజకవర్గాలు బందరు, గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు ఏకమవుతున్నాయి. హారిక ఘటనకు సంఘీభావంగా పెట్టుకున్న సభలో పేర్ని నాని ఈ పోరును ప్రారంభించారు. త్వరలో కొడాలి నాని, వంశీ కూడా వచ్చి పోరాటాలు మొదలుపెడతారని ప్రకటించారు. ఓవైపు టీడీపీ ఈ త్రయాన్ని ఎదుర్కునే క్రమంలో కొత్తగా ఉప్పాల హారికపై దాడికి దిగి రాజకీయంగా చేసిన తప్పు.. ఇప్పుడు వీరిని అనుకున్న దాని కంటే వేగంగా, ముందుగానే వైసీపీ దూకుడుగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇచ్చిందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.




Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now