ANDHRAPRADESH:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 77,044 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,478 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 5.44 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి మూడు కోట్ల విలువైన ఇళ్లు, బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలను విరాళంగా అందించి శ్రీవారిపై తనకు ఉన్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు.
భాస్కర్ రావుకు హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం పేరుతో 3,500 చదరపు అడుగులు గల భవనం ఉంది. దీన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో దీన్ని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.
భాస్కర్ రావు స్ఫూర్తితో హైదరాబాద్ కే చెందిన మరో భక్తురాలు టీటీడీకి తమ ఆస్తి మొత్తాన్ని కూడా రాసిచ్చేశారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి వసంతపురి కాలనీకి చెందిన టీ సునీత దేవి, టీ కనక దుర్గ ప్రసాద్ దంపతులు 18.75 లక్షల రూపాయల విలువ చేసే 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు.
టీ సునీత దేవి, టీ కనక దుర్గ ప్రసాద్ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. ఆస్తి పత్రాలను తిరుమలలో అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు.