ANDHRAPRADESH:గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు టిడిపి శ్రేణులు నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. తాజాగా అశోక్ గజపతిరాజు ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అశోక్ గజపతిరాజు సేవలు విస్తరించాయని ఆమె అన్నారు.
ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అశోక గజపతి రాజు: మంత్రి వంగలపూడి అనిత
రాజకీయాలలో ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అశోక గజపతి రాజు అని, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు.50 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు ఆయన అనేక సేవలు చేశారని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్టును నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి అని అశోక్ గజపతిరాజు ను ఉద్దేశించి హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
అశోక్ గజపతి రాజుపై జగన్ వేధింపులు
ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపైన కొనసాగిన వేధింపులను గుర్తు చేసిన వంగలపూడి అనిత, అజాతశత్రువు గా పేరున్న అశోక్ గజపతిరాజు ను గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు. ఆరోజు ఆయన చాలా బాధపడ్డారని ఆయన బాధను తన స్వయంగా దగ్గరుండి చూసాను అన్నారు.వైయస్ జగన్ కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టి వేధించాడని ఆమె అన్నారు.
చంద్రబాబు మాత్రం చేసిన సేవలను గుర్తుంచుకుంటారు.
కానీ చంద్రబాబు మాత్రం చేసిన సేవలను గుర్తుంచుకొని ఆయనకు మంచి అవకాశం వచ్చేలా చేశారని వంగలపూడి అనిత చెప్పారు. వైయస్ జగన్ ది కక్షసాధింపు ధోరణి అయితే, చంద్రబాబుది సేవలను గుర్తించుకునే మనస్తత్వం అని వంగలపూడి అనిత చెప్పారు. యుద్ధానికి అయినా ఒక సమయం ఉంటుందని, కానీ జగన్ చేసే యుద్ధానికి సమయం లేదన్నారు.
కక్షలు కడుతూ, కేసులు పెట్టి వేధింపులు
రాత్రి, పగలు అని తేడా లేకుండా, కక్షలు కడుతూ, కేసులు పెట్టి వేధించేవాడని పేర్కొన్నారు. అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు దిగజారాడు అని, ఎంతోమంది సీనియర్లను టచ్ చేసాడు కనుక అదః పాతాళానికి పడిపోయాడని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఉన్నవారు ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడేలాగా రాజకీయాలు చేయాలన్నారు.