గూగుల్, మెటాలకు ఈడీ షాక్.. విచారణకు నోటీసులు!

HYDERABAD:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా నష్టపోయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు నిత్యం మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు జరగకుండా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

గూగుల్, మెటా లకు ఈడీ నోటీసులు

గూగుల్, మెటా ఈ రెండు కంపెనీలు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించాయని, తమ డిజిటల్ వేదికల్లో వాటి ప్రకటనలకు ప్రాధాన్యత ఇచ్చాయని ఈడీ భావిస్తోంది. ఇవి తమ ప్లాట్ ఫామ్ లపైన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కాదని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్, మెటా కంపెనీల ప్రతినిధులు జూలై 21న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కేసును సీరియస్ గా తీసుకున్న ఈడీ

ఈడీ తీసుకున్న ఈ చర్య ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో ఒక కీలక అడుగుగా భావించవచ్చు. గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చట్టవిరుద్ధ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్న ఈడీ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

కోట్ల రూపాయల నల్లధనం, హవాలా మార్గం

చాలా యాప్‌లు తమను తాము Skill based games గా చెప్పుకుంటూ అక్రమ బెట్టింగ్‌కు పాల్పడుతున్నాయని గుర్తించారు. ఈ ఆన్ లైన్ వేదికల ద్వారా కోట్ల రూపాయల నల్లధనం సంపాదిస్తున్నారని ఈడీ అనుమానిస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా హవాలా మార్గాలను ఎంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఈ వ్యవహారాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంటుంది.

ఇటీవల ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో 29 మందిపై కేసు నమోదు

ఇదిలా ఉంటే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటులు, టీవీ హోస్ట్‌లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లతో సహా 29 మందిపై కేసు నమోదు చేసింది. వీరంతా అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడీ నమోదు చేసిన కేసులో ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి వీరికి భారీగా డబ్బులు ఇచ్చినట్టు సమాచారం.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now